అక్బరుద్దీన్‌ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు..

0

ఏంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఓవైసీపై హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను నాంపల్లి న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్‌ పహిల్వాన్‌తో సహా 10మందిని న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ఏ 2 గా ఉన్న హసన్‌, ఏ 3 అబ్దుల్లా, ఏ 5 వాహిద్‌, ఏ 12 వహ్లాన్‌లను దోషులుగా నిర్ధారించింది. ఈ నలుగురికి పదేళ్ల జైలు శిక్షతో పాటు.. పది వేల జరిమానాను విధించింది.

2011 ఏప్రిల్‌ 30 న చాంద్రాయణగుట్ట కేశవగిరిలోని బార్కస్‌-బాలాపూర్‌ రోడ్డులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో అక్బరుద్దీన్‌కు తీవ్ర గాయాలు కాగా, దాడికి పాల్పడ్డ ఇబ్రాహిం బిన్‌ యూనుస్‌ యాఫై అనే వ్యక్తి గన్‌మెన్‌ కాల్పుల్లో మరణించాడు. ఈ కేసులో మొత్తం 15 మందిపై చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. తదుపరి చర్యల నిమిత్తం కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. సీసీఎస్‌ పోలీసులు వేగంగా పరిశోధించి ప్రధాన నిందితుడు మహ్మద్‌ బిన్‌ ఒమర్‌ యాఫై అలియాస్‌ మహ్మద్‌ పహిల్వాన్‌ సహా 14 మందిని అరెస్టు చేశారు. అనంతరం వీరందరిపై అభియోగపత్రాలు కోర్టులో సమర్పించారు. అక్బరుద్దీన్‌ ఒవైసీపై దాడికేసు విచారణ నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో ఆరేళ్ల నుంచి కొనసాగుతోంది. బెయిలు లేకుండా నిందితుల్లో పలువురు జైలుకే పరిమితం అయ్యారు. కేసులో మొత్తం 86 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. గత నెలలోనే విచారణ పూర్తయింది.

ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌పై దాడి కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మహ్మద్‌ పహిల్వాన్‌ సహా పది మందిని నిర్దోషులుగా తేల్చింది. నలుగుర్ని మాత్రమే దోషులుగా ప్రకటించింది. ఏ2, ఏ3, ఏ5, ఏ12లను దోషులుగా తేల్చింది.
తుదితీర్పు నేపథ్యంలో నాంపల్లి కోర్టుతో పాటు పాతబస్తీలోనూ ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేశారు.